
రెండో రోజూ ముగ్గురే!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన మహిళా జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణకు రెండో రోజైన బుధవారం కూడా ముచ్చటగా ముగ్గురే హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమకు మండలాల్లో తమకు ఎలాంటి విలువను ఇవ్వడం లేదని, 19 నెలలుగా గౌరవ వేతనాలను కూడా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచారని జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేఫథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ‘ మహిళా నాయకత్వంలో మార్పు – స్థానిక స్వపరిపాలనలో సాధికారత ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణను స్థానిక జిల్లా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో ప్రారంభించారు. మొదటి రోజున ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాగా, 2వ రోజు శిక్షణకు కూడా ముగ్గురే ( జెడ్పీ వైస్ చైర్మన్, హొళగుంద జెడ్పీటీసీ సభ్యురాలు కురువ బుజ్జమ్మ, గోస్పాడు నుంచి పీ జగదీశ్వరమ్మ, బండి ఆత్మకూరు నుంచి రామతులశమ్మ ) మాత్రమే హాజరయ్యారు. హాజరైన ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులకు రిసోర్స్ పర్సన్స్ జీ నగేష్, కే రవికిశోర్ పలు అంశాలను వివరించారు.