
ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అక్రమ నిల్వలు, చట్టాలకు లోబడి అమ్మకాలు జరుగుతున్నాయా అనే దానిపై వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల్లో ప్రత్యేక స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టింది. వ్యవసాయ శాఖ ఇతర జిల్లాల అధికారులు, విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంటు అధికారులతో అన్ని జిల్లాలకు టీమ్‌లు పంపింది. కర్నూలు జిల్లాకు రెండు టీమ్‌లు వచ్చాయి. ఒంగోలు ఏడీఏ రమేష్‌బాబు, విజిలెన్స్ సీఐ నారాయణప్పలతో కూడిన టీమ్ కల్లూరు మండలంలో తనిఖీలు నిర్వహించింది. పత్తికొండ డివిజన్‌లో వెంకటేశ్వర్లు, వెంకటప్రసాద్‌లతో కూడిన టీమ్ తనిఖీలు చేపట్టింది. విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో కల్లూరు ఏవో విష్ణువర్ధన్‌రెడ్డితో కలసి తనిఖీలు నిర్వహించారు. శ్రీరామ అగ్రీ జెనటిక్‌కు చెందిన పత్తి విత్తన ప్రాసెసింగ్ సెంటరులో తనిఖీలు చేపట్టారు. పరమేశ్వర ఏజెన్సీస్ ఎరువుల దుకాణంలో సరైన రికార్డులు లేనందున రూ.46700 విలువ సూక్ష్మపోషకాల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలతో పాటు ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లోను తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బాగంగా రికార్డులను, స్టాకు తదితర వివరాలను పరిశీలించారు.
దేవనకొండలో..
దేవనకొండ: దేవనకొండలో సోమవారం విత్తనాలు, పురుగుమందు, ఫర్టిలైజర్ షాపులను ఇన్‌ఫెక్షన్ సర్‌ప్రైజ్ స్క్వాడ్ అధికారి కె.ఐ.సుదర్శన్‌రాజు, విజిలెన్స్ ఎస్‌ఐ యు.వెంకటప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్, దేవనకొండ ఏఓ ఉషారాణి పాల్గొన్నారు.