
ప్రభుత్వాలకు అభివృద్ధి పట్టదా!
● కూటమి ప్రభుత్వంలోరైతు సంక్షేమమేదీ? ● స్మార్ట్ మీటర్లపై చంద్రబాబు మాట మార్చారు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ఆలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేసి, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆలూరులో స్థానిక పాతబస్టాండు ఆవరణలో నియోజకవర్గం సీపీఐ 12వ మహా సభలను సీపీఐ జిల్లా కార్యదర్శి కె. గిడ్డయ్య నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు ఏడాదికి పంటల సాగుకు అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు జమచేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు బాబు రైతులను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమం కనిపించడం లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ విద్యుత్ మీటర్లు వద్దని డిమాండ్ చేసి ఇప్పుడు అదే మీటర్లు ఇంటింటీకి అమర్చుతుండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు చెల్లుతుందన్నారు. సమావేశానికి సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటిశెట్టి, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు భూపేష్, సీపీఐ జిల్లా నాయకుడు నబీరసూల్ తదితరులు హాజరయ్యారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి..
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినప్పుడే వ్యవసాయ రంగం గాడిలో పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పైసా కేటాయించపోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సామాన్య ప్రజలు, రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. సమావేశానికి ముందుగా పురవీధుల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలసి ర్యాలీ నిర్వహించారు.