
తల్లిదండ్రుల కల సాకారం చేయాలి
వెల్దుర్తి: కష్టపడి చదివి తల్లిదండ్రుల కల సాకారం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం స్థానిక బాలికల జెడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం చంద్రావతి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కులు ప్రామాణికం కాదని, అభిరుచి తగ్గట్లు క్రీడలు, ఇతర అంశాల్లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థినుల హాజరు, రికార్డులు పరిశీలించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని హెచ్‌ఎంను ఆదేశించారు. తల్లిదండ్రులతో కలిసి డీఈఓ కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి కలెక్టర్, డీఈఓ భోజనం చేశారు.