
ఇవేనా గుంతల్లేని రోడ్లు?
గుంతల్లేని రోడ్లను నిర్మిస్తామని ఊదరగొట్టిన కూటమి పార్టీల నాయకులు ఏడాది పాలన గడిచినా మొద్ద నిద్ర వీడలేదు. రోడ్లపై అడుగుకో గుంత కనిపిస్తున్నా కళ్లులేని కబోదిలా అంతా బాగుందని, ఏడాది సుపరిపాలన అదించామంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు.. గుంతల రోడ్లే ఎక్కువ అనుకుంటున్నారేమో? కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు.
కర్నూలు నుంచి వయా జొహరాపురం, వెంకాయపల్లె వరకు బీటీ రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ దారిలో వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. అడుగడుగునా మలుపులు, రోడ్డంతా కంకర తేలి గుంతలు పడింది. విద్యుత్ దీపాలు కూడా లేవు. ఈ మార్గంలో వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే భక్తులు, పిల్లలను బడికి పంపే హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరమ్మ గృహాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ధ్వంసమైన రోడ్డును ప్రభుత్వం బాగు చేయాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు