
తపాలా శాఖలో అత్యాధునిక సాంకేతికత
కర్నూలు (న్యూటౌన్): భారత ప్రభుత్వం, తపాలా శాఖ చేపట్టిన ఆధునికీకరణలో భాగంగా ఏపీటీ (అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ) 2.0 సేవలు రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన కార్యాలయాల్లో ప్రారంభమయ్యాయని కర్నూలు పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ వెన్నం ఉపిందర్ అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని హెడ్ పోస్టాఫీసులో ఏపీటీ 2.0 రోల్ అవుట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ఎక్సలెన్స్ దిశగా తపాలాశాఖ చేపడుతున్న చర్యల్లో ఏపీటీ 2.0 ఒక మైలురాయి అన్నారు. ఏపీటీ అప్లికేషన్‌ను వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడానికి రూపొందించామన్నారు. ఈ నూతన టెక్నాలజీతో పోస్టాఫీసుల పనితీరు మరింత సమర్థవంతంగా మారనుందన్నారు. కర్నూలు సూపరింటెండెంట్ జి.జనార్ధన్‌రెడ్డి, కర్నూలు రీజనల్ పోస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగనాయక్, కర్నూలు హెడ్ పోస్ట్‌మాస్టర్ సి.రాజేశ్వరి, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.