
ఈరన్న ఉత్సవాలను విజయవంతం చేద్దాం
కౌతాళం: అందరి సహకారంతో ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలను విజయంతం చేద్దామని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు అధ్యక్షతన మంగళవారం నూతనంగా నిర్మించిన డార్మెంటరీలో శ్రావణమాస ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం జరిగింది. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై చర్చిస్తూ.. ఉరుకుందకు నలువైపులా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేష్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని శిరుగుప్ప, రాయచూరు, బళ్లారి డిపోల వారు ప్రత్యేక బస్సులు నడిపేలా కృషి చేయాలన్నారు. ఆలయం వద్ద విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. తాగునీరు పుష్కలంగా ఉండాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ సాంబయ్యకు సూచించారు. పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.
ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలతో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలని, బస్సులు తిరిగేందుకు స్థలాలను చదును చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు నాలుగు వైపులా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 48 సీసీ కెమెరాలతో పాటు 54 కెమెరాలతో నిఘా ఏరాటు చేసినట్లు ఆలయ డిప్యూటి కమిషనర్ విజయరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళలోనూ అన్నదానం, నిత్య పూజలను వీక్షించేందుకు ఆలయం ఆవరణలో ఆరు చోట్ల భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఉంటుందని, ఆ రోజు మహిళలకు ఉచిత దర్శనంతో పాటు గాజులు, రవిక ఇస్తామని చెప్పారు. భక్తులు తలనీలాల సమర్పించేందుకు మూడుచోట్ల కల్యాణ కట్టల ఏర్పాటు, అలాగే మూడుచోట్ల ప్రసాదం అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తహసీల్దారు రజినీకాంత్‌రెడ్డి, సీఐ అశోక్‌కుమార్, ఏఈలు నర్సన్న, నాగమల్లయ్య, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సారాను అరికట్టండి
ఉరుకుందలో సారాను అరికట్టాలని ట్రస్టు బోర్డు మాజీ డైరెక్టర్ కోట్రేష్‌గౌడ్ సభ దృష్టికి తెచ్చారు. ఇటీవల మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని, దీన్ని అరికడితేనే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించగలమన్నారు. ఉరుకుందలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నించారు.