
నిర్లక్ష్యానికి పరాకాష్ట!
పత్తికొండ–ఆదోని మార్గంలో రోడ్డు మధ్యలో ఏర్పడిన పెద్ద గుంత
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఈ చిత్రం నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆ పార్టీల నాయకులంతా చెప్పేవి కళ్లబొల్లి మాటలే గానీ.. చేతలు ఉండవని స్పష్టం చేస్తోంది. అనాడేమో తాము అధికారంలోకి వస్తే రోడ్లన్నీ బాగుచేస్తామని టీడీపీ, జనసేన నాయకులు ఊదరగొట్టారు. పాలన చేపట్టి ఏడాది దాటినా రోడ్లు బాగు చేయడం కాదు కదా.. కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేకపోయారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి కుటుంబాలు రోడ్డున పడితేగాని నిర్లక్ష్యంతో మొద్దునిద్దరోతున్న ప్రభుత్వానికి రోడ్లపై ఏర్పడిన గుంతలు కనపడవేమో!
పత్తికొండ – ఆదోని మార్గంలో హంద్రీనీవా కా లువ సమీపంలో రోడ్డు మధ్యలో కుంగిపోయి గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలియదు. ఈ మార్గంలో నిత్యం బస్సులు, కార్లు, జీపులతో పాటుగా ద్విచక్ర వాహనాలు వందలాదిగా వెళ్తుంటాయి. దీనికి సమీపంలోనే మద్యం దుకాణం కూడా ఉంది. ఇక్కడే ఉన్న ఓ కల్వర్టు ప్రమాదకరంగా ఉండటంతో చుట్టూ ఫెన్సింగ్ వేశారు. రాత్రి సమయాల్లో వాహనాలు రయ్యిమని దూసుకొస్తూ రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను చివరి క్షణంలో గుర్తించి వేగం తగ్గించుకుని రెప్పపాటులో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. ముందుకు వెళ్లేశాక ‘హమ్మయ్యా.. దాటేశాం’. నడిరోడ్డుపై ఇంత పెద్ద గుంత ఉన్నా ఈ ప్రభుత్వానికి కనపడదా అని వాహనదారులు, ప్రయాణికులు కూటమి నిర్లక్ష్యంపై పెదవి విరుస్తున్నారు.
– పత్తికొండ రూరల్