
ఆపరేషన్ ‘క్యాంపస్ సేఫ్ జోన్’
● విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం ● జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్
కర్నూలు: జిల్లా పోలీసు శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థల వద్ద వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఆపరేషన్ ‘క్యాంపస్ సేఫ్ జోన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద వంద గజాల దూరంలో పొగాకు సంబంధిత పదార్థాల అమ్మకంపై నిషేధం విధిస్తూ ఆపరేషన్ ‘క్యాంపస్ సేఫ్ జోన్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాన్ షాపులు, కిరాణం దుకాణాలు, టీ షాపుల వద్ద సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి అమ్మకాలను నిలిపివేయాలని వ్యాపారులను ఆదేశించారు. పోలీసుల సూచనలను పాటించని వ్యాపారులపై సీఓపీటీఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడమే గాక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు అక్రమంగా కలిగి ఉన్నా, విక్రయాలు జరిపినా సీఓపీటీఏ చట్టం ప్రకారం షాపులను సీజ్ చేసి, యజమానులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తనిఖీ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు.