
లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలి
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ లక్ష్యాలపై వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు, అసిస్టెంటు డైరెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ సూచించారు. వ్యాక్సినేషన్, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపడం వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంగళవారం కర్నూలులోని బహుళార్థ పశువైద్యశాల ప్రాంగణంలో జిల్లాలోని పశువైద్యులు, ఏడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలన్నింటికీ యాంటీ రేబిస్ వాక్సిన్ చేయించాలని సూచించారు. అన్ని పశు వైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలని, దీనిపై పశుపోషకులకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులపై పశువైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలన్నారు. పశుగ్రాసాల సాగును ప్రోత్సహించాలని, సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, ఆదోని డీడీలు దుర్గాప్రసన్నబాబు, రమణ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డీడీ రాజశేఖర్, వీపీసీ డీడీ హేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.