
నేడు పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు
కర్నూలు(అగ్రికల్చర్): జంతవుల నుంచి మనుష్యులకు, మనుష్యుల నుంచి జంతవులకు సంక్రమించే వాటిని జూనోసిస్ వ్యాధులుగా వ్యవహరిస్తారు. దాదాపు 280 వ్యాధులను పశువైద్యులు గుర్తించారు. 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి జూనోసిస్ వ్యాధి రాకుండా లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా టీకా మందు వేసి విజయవంతమయ్యారు. అప్పటి నుంచి ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. చికిత్సకన్నా–నివారణే మిన్న అనే సూత్రాన్ని పాటిస్తూ పెంపుడు జంతవులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. . జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్‌లో పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 36,610 డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ వచ్చిందని, ఇందులో కర్నూలు జిల్లాకు 13,000 డోసులు, నంద్యాల జిల్లాకు 20,700 సరఫరా అయిందని, మిగిలిన వ్యాక్సిన్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రంలో బఫర్‌లో ఉంటుందని తెలిపారు. వారం రోజుల పాటు టీకాలు వేయనున్నామని పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.