
సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం
12,558 కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటినుంచో పరిష్కారానికి నోచుకోని భూసేకరణ కేసుల్లో నష్టపరిహారం చెక్కులను ఈ సందర్భంగా అందజేశారు. ఈ సంవత్సరంలో రెండోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్‌వీ శేషాద్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేసి 12,558 కేసులు పరిష్కరించామన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చొరవతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు కమలాదేవి, వాసు, శ్రీవిద్య, అదనపు సబ్ జడ్జి దివాకర్, జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పోలీస్, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.