
అడుగు దూరంలో నీటి విడుదల
● పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను తాకిన కృష్ణాజలాలు
జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం రోజుకు రోజుకు పెరిగి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను తగిలాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 851.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. గతేడాది జులై 27న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతుండటంతో క్రమేణా డ్యాంలో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గతేడాది కంటే నెలరోజులు ముందుగానే పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీటిని విడుదల చేసుకునే అవకాశాలున్నాయి.