
దేవదాయ శాఖ డీఈఈగా శ్రీనివాసులు
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖ కర్నూలు సబ్ డివిజన్ డీఈఈగా సీహెచ్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాస ప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. దీంతో గుంటూరు సబ్ డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసులుకు కర్నూలు డీఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి నుంచి జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీలోపు https:// nationalawardstoteachers. gov. in/ Login. aspx అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు.
కనీస వేతనం ఇవ్వాలి
కర్నూలు(సెంట్రల్): పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్ వాచ్‌మన్‌కుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఐదు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇవ్వాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆయాల పేరుతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంలో ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు జమ చేసుకుందని, ఆ నిధులతో వారికి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయాలకు గ్రూపు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. ఆయాలు బజారమ్మ, సుశీలమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
కేఎంసీలో పాథాలజీ
రాష్ట్రస్థాయి సదస్సు
కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలో త్వరలో 7వ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె పాథాలజీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్యులు పాల్గొంటారన్నారు. ఆమె వెంట డాక్టర్ హేమలత, డాక్టర్లు రేవతి, సునీత, షహనాజ్, విష్ణు పాల్గొన్నారు.
వజ్రం లభ్యం
మద్దికెర: మండల పరిధిలోని బసినేపల్లి గ్రామ సమీపంలోని పొలంలో వ్యవసాయ కూలీకి సోమవారం వజ్రం లభ్యమైంది. ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఆర్టీసీలో పదోన్నతులు కల్పించాలి
కర్నూలు సిటీ: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా పెంగింగ్‌లో ఉన్న పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఏపీ జిల్లా ప్రజా రవాణా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగస్వామి, ఏవీ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 4,5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు.