
టీబీ డ్యాంకు తగ్గిన ఇన్‌ఫ్లో
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఉన్నట్టుండి ఇన్‌ప్లో తగ్గిపోవడంతో క్రస్టుగేట్ల ఎత్తివేత మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం డ్యాంకు 65వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. సోమవారం దాదాపు 40 వేల క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు డ్యాంపై నిర్మించిన శివమొగ్గలోని అప్పర్ తుంగా ప్రాజెక్టు(గాజనూరు జలాశయం) నుంచి దిగువకు నీటి నిడుదలను నిలిపివేశారు. దీంతో టీబీ డ్యాంకు వచ్చే వరద సగానికి తగ్గింది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 80 టీఎంసీలకు చేరితే క్రస్టు గేట్లు ఎత్తి నీటిని నదికి వదులుతారు. ఈ లెక్కాన గేట్లు ఎత్తడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ నెల 10న తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేయనుండడంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు.