కలెక్టరేట్ ఏఓగా శివరాముడు బాధ్యతల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్ ఏఓ(పరిపాలన అధికారి)గా ఆర్.శివరాముడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆదోని తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఈయన కలెక్టరేట్ ఏఓగా బదిలీ అయ్యారు. ఇక్కడ ఏఓగా ఉన్న ఐ.విజయశ్రీని నంద్యాల జిల్లాకు కేటాయించారు. ఈక్రమంలో ఆయన ఇన్‌చార్జి డీఆర్వో బీకే వెంకటేశ్వర్లును కలిసిన అనంతరం చార్జి తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న ఆర్.శివరాముడును ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఇతర ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వ్యవసాయాధికారుల బదిలీల్లో
కొనసాగుతున్న పైరవీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ అధికారుల బదిలీల్లో పైరవీల పర్వం కొనసాగుతోంది. ఇటీవలి వరకు ఓర్వకల్లు ఏఓగా పనిచేసిన సుధాకర్ ఆదోని మండల వ్యవసాయ అధికారిగా పోస్టింగ్ కోసం సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఊహించని రీతిలో 20 నెలల క్రితం వరకు దాదాపు ఆరేళ్లు ఏఓగా పనిచేసిన పాపిరెడ్డి మళ్లీ ఆదోని ఏఓ పోస్టు దక్కించుకున్నారు. ఆదోని ఏఓ పోస్టును ఆశించిన సుధాకర్‌కు ఎమ్మిగనూరు ఫామ్ దక్కింది. అయితే ఆయన ఆదోని ఎమ్మెల్యే ద్వారా వ్యవసాయ శాఖ కమిషనర్‌పై ఒత్తిడి తేవడంతో పాపిరెడ్డిని వెనక్కి పంపి.. సుధాకర్‌ను ఆదోని ఏఓగా నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. మార్పులు, చేర్పుల ఉత్తర్వులన్నీ 9వ తేదీతోనే జారీ అవుతుండటం గమనార్హం. కాగా గూడూరు ఏఓగా పనిచేస్తున్న శ్రీవర్ధన్‌రెడ్డిని మొదట కర్నూలు ఏడీఏ కార్యాలయం టెక్నికల్ ఏవోగా నియమించారు. ఈయనను గుత్తి ఏడీఏ కార్యాలయం టెక్నికల్ ఏవోగా బదిలీ చేశారు. 24 గంటలు గడవక ముందే మళ్లీ కర్నూలు ఏడీఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఇక్కడకి బదిలీ చేసిన మంజుల గుత్తి ఏడీఏ కార్యాలయానికి వెళ్లారు.
కంబదహాల్‌లో దా‘రుణం’
● పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య
సి.బెళగల్: పంటలు పండలేదు.. ప్రభుత్వం నుంచి సా యం అందలేదు.. అప్పులు కుప్పలా పేరుకుపోయాయి.. ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సి.బెళగల్ మండలం కంబదహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపి న వివరాల మేరకు.. బోయ తిమ్మప్ప (55)కు భార్య కుసుమవతి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఉల్లి వేయగా నష్టం వచ్చింది. పెట్టుబడి కోసం రూ.6 లక్షలు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.5 లక్షలు అప్పు చేశారు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు.


