అభివృద్ధికి ఆదోని జిల్లా చేయాలి
● జేఏసీ నాయకుల నిరసన
ఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు శుక్రవారం వారు సంఘీభావం తెలిపారు. అనంతరం శివ సర్కిల్‌లో రాస్తారోకో చేసి అక్కడే బైఠాయించారు. ఆదోని జిల్లా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు నియోజకవర్గాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ, హంద్రీ–నీవా, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేయాలని కోరారు. ఆదోని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. సత్వరం ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. జేఏసీ నాయకులు గణేష్, సత్యన్న, రాజు, సత్యనారాయణరెడ్డి, ఆఫ్రిది, కృష్ణ, మహేంద్ర, ఖాజ, ఉదయ్, శేఖర్, నల్లారెడ్డి, రఘునాథ్ పాల్గొన్నారు.


