పేదల భవిష్యత్తును వేలం వేయడమే ‘ప్రైవేటీకరణ’
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): పేదలకు విద్య, వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ అజెండా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రెవేటీకరణ చేయడమంటే పేదల భవిష్యత్తును వేలం వేయడమే అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి నాలుగు లక్షల సంతకాలను జగనన్న నేతృత్వంలో గవర్నర్‌కు అందజేశామన్నారు. ప్రజా స్పందన ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భూమి ఇచ్చి, నిర్మాణాలు చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పించి 66 ఏళ్ల లీజు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందని చంద్రబాబు నాయుడు నిసిగ్గుగా చెప్పడం దారుణంగా ఉందన్నారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమం రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజల మనుగడ కోసం చేసిన పోరాటమన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో అమలులో ఉన్న నిబంధనలే అమలు చేయాలన్నారు.
రూ.2.75 లక్షల కోట్లు ఏం చేశారు?
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.2.75 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. విద్యా శాఖమంత్రిగా కొనసాగుతున్న లోకేష్ ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ బిల్డింగ్ అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పేరుతో 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ. 4 వేలు, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు, న్యాయవాదులకు రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరచిపోయారన్నారు. అప్పుగా తెచ్చిన రూ.2.75 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. అమరావతిలో కిలో మీటర్ రోడ్డుకు రూ.170 కోట్లు ఖర్చు చేస్తున్నారని, రోడ్డుకు బంగారు పూత పూస్తున్నారా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ విక్రమ సింహారెడ్డి, పార్టీ నేతలు కిషన్, రాఘవేంద్ర నాయుడు, పాండు, శ్రావణ్, అశోక్ లాజరస్, అస్లాం పాల్గొన్నారు.


