పనిచేస్తూనే పరలోకాలకు!
సి.బెళగల్: జీవనోధారమైన ఇంటి నిర్మాణ పనులకు వచ్చిన ఓ వ్యక్తి పనిచేస్తూనే మృతి చెందాడు. ఈ దుర్ఘటన మండల కేంద్రం సి.బెళగల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందిన జయరాజు (35) కు భార్య సంధ్యారాణితో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ఇంటి నిర్మాణ పనులకు వెళ్లేవారు. బుధవారం స్వగ్రామస్తులతోపాటు ఏనుగబాల కూలీలతో కలసి సి.బెళగల్‌కు వెళ్లారు. పనుల మధ్యలోనే జయరాజు అస్వస్థకు గురయ్యాడు. విశ్రాంతి తీసుకోవాలని తోటి కూలీలు సూచించినా వినలేదు. గుండెపోటుకు గురై పని ప్రాంతంలోనే అచేతనంగా మారాడు. గమనించిన తోటి కూలీలు స్థానిక ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లగా.. జయరాజు అప్పటికే మృతి చెందినట్లు తెలిపాడు. దీంతో జయరాజు మృతదేహాన్ని కడిమెట్ల గ్రామానికి తీసుకెళ్లారు. కడుపు చేతపట్టుకుని పనికోసం వచ్చిన వ్యక్తి ప్రాణాలే కోల్పోవడంపై పలువురు విచారం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి


