క్షేత్రస్థాయి వ్యవస్థలను బలోపేతం చేయాలి
కర్నూలు(సెంట్రల్): క్లిష్ట పరిస్థితుల్లో మహిళలను ఆదుకునేలా క్షేత్ర స్థాయిలో వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మిషన్ శక్తిలో భాగంగా అమలవుతున్న వన్‌స్టాప్ సెంటర్, మహిళా హెల్ప్‌లైన్, నారీ అదాలత్, శక్తి సదన్‌లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో ఉన్న మహిళలను ఆదుకునే వన్‌స్టాప్ సెంటర్లను జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల, డివిజన్ కేంద్రాల్లో బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం అంగన్‌వాడీలు, మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నిర్మళకు సూచించారు. వన్‌స్టాప్ సెంటర్ అసంపూర్ణంగా ఉండడంతో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని పీడీ నిర్మళను ఆదేశించారు. మహిళా హెల్ప్‌లైన్, నారీ అదాలత్, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శక్తి సదన్‌కు సంబంధించి ఒకేషనల్ ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమల శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అక్కడున్న మహిళలను స్వయం సహాయక గ్రూపుల్లో చేర్పించి స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ.. వన్‌స్టాప్ సెంటర ద్వారా సర్వీసు రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని, పరిహార కేసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషినల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, డీఈఓ శామ్యూల్‌పాల్ పాల్గొన్నారు.


