
బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు
కర్నూలు (అర్బన్): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించిన కర్నూలు జిల్లా బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, రవికుమార్ మంగళవారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మార్కుల జాబితా, చిరునామా, ఫోన్ నంబర్లను సంఘం ప్రధాన కార్యదర్శి 9000009440 నంబర్‌కు ఈనెల 30వ తేదీ లోపు వాట్సాప్ ద్వారా పంపాలన్నారు. జూన్ 1న ప్రతిభ పురస్కారాల ప్రదాన కార్యక్రమం కర్నూలులో ఉంటుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని, మిగిలిన మెరిట్ విద్యార్థులందరికీ మొమెంటో, ఎగ్జిక్యూటివ్ ఫైల్, ప్రతిభ పురస్కార పత్రం ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రధాన సలహాదారులు డాక్టర్ సింగం శెట్టి సోమశేఖర్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ కుమార్, కోశాధికారి శైలేష్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఏపీఆర్‌జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్
ఎమ్మిగనూరురూరల్: ఏపీఆర్‌జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. మంగళవారం మండల పరిఽధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూర్ జిల్లాల విద్యార్థినులకు ర్యాంక్ ఆధారంగా మొదటి విడతలో ఎంపీసీ, బైపీసీ విభాగాలకు కౌన్సెలింగ్ చేపట్టినట్లు ప్రిన్సిపాల్ గిర్వానీ తెలిపారు. మొదటి విడత పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
మూల్యాంకనానికి ఏర్పాట్లు
కర్నూలు సిటీ: ఈ నెల 19వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. మైనర్ మీడియంకు చెందిన పరీక్ష బుధవారం జరగనుంది. పరీక్షలు ముగియడంతో మూల్యాంకనానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు జిల్లాకు సుమారుగా 20 వేలు రానున్నాయి. ఈ నెల 31, జూన్ 1, 2 తేదీల్లో మూల్యాంకనం జరుగనుంది. ప్రస్తుతం పేపర్ కోడింగ్ జరుగుతోంది.
మహిళ అదృశ్యం
కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని సిద్దప్ప పాళెం దుర్గానగర్‌లో నివాసముంటున్న ఆదోని ప్రమీలమ్మ అనే మహిళ ఈనెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆదోని శ్రీనివాసులు, దుబ్బన్న, వీరేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఆమె భర్త ఆదోని ఈరన్న కొద్ది కాలం క్రితం హత్యకు గురై మృతి చెందాడు. ఆనాటి నుంచి ఆమె మానసికంగా బాధపడుతూ మనోవేదనకు గురైందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీన హోటల్‌లో టీ తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. బంధువులు, తెలిసిన వారి వద్ద గాలించినా ఆచూకి లభించలేదని తెలిపారు. ఆచూకి తెలిసిన వారు ఫోన్ నెంబర్ 99853 28667, 91001 39827లకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు