
ఇసుక రీచ్‌లు వద్దే వద్దు
నందవరం: ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయవద్దంటూ నాగలదిన్నె, గంగవరం, జొహరాపురం గ్రామాల ప్రజలు అధికారులకు తెగేసి చెప్పారు. మంగళవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి కిశోర్ రెడ్డి నేతృత్వంలో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నాగలదిన్నె, జొహరాపురం గ్రామాల్లో ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాట్లాడుతూ నాగలదిన్నె గ్రామంలోని సర్వే నంబర్ 154లో తుంగభద్ర నదిలో 5.363 హెకార్టర్లలో ఏడాదికి 53,630 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు చేపట్టనున్నట్లు వివరించారు. గంగవరం, జొహరాపురం గ్రామ సర్వే నంబర్లు 1,258లో తుంగభద్ర నదిలో 82,500 క్యూబిక్ మీటర్లు ఏడాదికి సాధారణ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ నదిలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయని, తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని వివరించారు. రైతులు రూ.లక్షలు వెచ్చించి నది నుంచి వేసుకున్న పైపులైన్లు పగలి పోతాయని, కోతకు గురవుతాయని పెద్దకొత్తిలి ఎంపీటీసీ సభ్యుడు విజయమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్‌లు ఏర్పాటు చేయవద్దని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. కాగా నది ఒడ్డున వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరించి ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని నాగలదిన్నె సర్పంచ్ బోయ లక్ష్మి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, జిల్లా మైనింగ్, జియాలజీ విభాగం అధికారి రవిచందు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మూర్తి, సీఐ మధుసూదన్‌రావు, మండల సర్వేయర్ అక్బర్‌బాషా పాల్గొన్నారు.
అధికారులకు విన్నవించుకున్న ప్రజలు