
2న మండల కేంద్రాల్లో ధర్నాలు
కర్నూలు(అర్బన్): పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్‌పై సీపీఐ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యం తడిచిపోతున్నా, టార్పాలిన్లు కూడా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోదీ భజనలో మునిగి తేలుతున్నారన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని చిన్న దేశాలతో కాకుండా చైనాతో మన దేశం పోటీ పడాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, రాష్ట్ర నాయకులు పి.రామచంద్రయ్య, కె.జగన్నాథం, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు.