
ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలి
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తున్న ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ కోరారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహనాలను కొనసాగించాలన్నారు. ఆటో కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ఎండీయూ ఆపరేటర్లు రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్, ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. కేశవయ్య, కార్యదర్శి అక్బర్‌వలి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కోపంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగిస్తోందన్నారు. ప్రభుత్వం తమతో చేసుకున్న గడువు వరకు కొనసాగించాలని, తరువాత కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉపాధిని చూపాలని ఎండీయూ ఆపరేటర్ల కోరారు. ఎండీయూ ఆపరేటర్లు అక్బర్‌వలి, కేశవ్, మహ్మద్‌రఫీ, వీరేష్, శీను, మద్దిలేటి పాల్గొన్నారు.
కర్నూలులో రాజ్‌విహార్ నుంచి
కలెక్టరేట్ వరకు ర్యాలీ, నిరసన