
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఓర్వకల్లు: యోగా మనిషి జీవితంలో భాగం కావాలని, సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సోమయాజులపల్లెలోని బ్రహ్మకుమారీ మ్యూజియంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీతో పాటు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం యోగా ట్రైనర్లు ప్రొటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ విద్యాసాగర్, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్‌శెట్టి పాల్గొన్నారు.