
నామమాత్రంగా విత్తన కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు నామమాత్రంగా వేరుశనగ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 17,457.50 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ అయ్యాయి. అయితే ఈ ఏడాది 6449.5 క్వింటాళ్లు కోత కోసి 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం పట్ల ఆందోళన వెల్లువెత్తుతోంది. ఉమ్మడికర్నూలు జిల్లాలో దాదాపు దాదాపు 63 వేలకు పైగా హెక్టార్లలో సాగు చేస్తారు. కర్నూలు జిల్లాకు 9099, నంద్యాల జిల్లాకు 2009 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. దీంతో వేరుశనగ కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కే అవకాశం ఏర్పడింది. అలాట్‌మెంటు భారీగా తగ్గించిన ప్రభుత్వం కిలో వేరుశనగ పూర్తి ధరను రూ.93 నిర్ణయించింది. సబ్సిడీ 40 శాతం ప్రకటించింది. క్వింటాలుకు సబ్సిడీ రూ.37.20 ఉంటుంది. రైతులు కిలోకు సబ్సిడీ పోనూ.. రూ.55.80 చెల్లించాలి. ఈ సారి వర్షాలు ఆశాజనకంగా పడుతున్నందున వేరుశనగకు డిమాండ్ ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నామమాత్రంగా కేటాయించిన వేరుశనగను ఎలా పంపిణీ చేయాలనే ఆందోళనలో వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 200 వరకు మాత్రమే వేరుశనగ విత్తన ప్యాకెట్లు సిద్ధమయ్యాయి.
గోరుకల్లు మరమ్మతులకు
టెండర్లు
పాణ్యం: గోరుకల్లు జలాశయ కట్ట మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించినట్లు ఈఈ సుభకుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కట్ట కుంగిపోవడంతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దీంతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. రూ. 2.50 కోట్లతో చేపట్టే మరమ్మతు పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలం కిటకిట
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు స్లాట్‌లలో పలువురు భక్తులు స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు.