
స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత
● ఎస్సీలకు రూ.40.73 కోట్లు అంటూ
ఆర్భాటాలు
● బీసీలను ఊరించిన
రూ.41.23 కోట్ల రుణాలు
● నేటికి జమ కాని ఫూలే జయంతి
రోజున ఇచ్చిన రూ.11.73 కోట్ల
మెగా చెక్కు
● అదే దారిలో మైనారిటీ, గిరిజన
కార్పొరేషన్ల రుణాలు
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు తదితర పేద వర్గాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టేందుకు సిద్ధమైంది. ‘ఇదిగో రుణాలు ఇస్తున్నాం .. వెంటనే దరఖాస్తు చేసుకోండి’ అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత, పేద వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
ఆశలకు ‘మూత’ వేసి
జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 973 మందికి రూ.40.73 కోట్ల మేర సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ( 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ) రుణాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ దరఖాస్తు చేసుకునే సైట్‌కు ప్రభుత్వం మూత వేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
నిరాశే మిగిలింది!
అన్ని కార్పొరేషన్ల కంటే ముందుగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారాలను కూడా ముమ్మరం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 2,034 మందికి రూ.41.23 కోట్ల మేర రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ఊరించింది. దీంతో జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు 27,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు కూడా జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగులుతోంది.
జమ ఎప్పుడో?
బీసీలను నమ్మించేందుకు గత నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి రోజున జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 508 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని ప్రకటించారు. వారికి రూ.11.73 కోట్ల మెగా చెక్కును అందించారు. అయితే నేటికీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రుణం జమ కాలేదు.
అదే దారిలో మైనారిటీ, గిరిజన రుణాలు ...
బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించాల్సిన రుణాల్లో జాప్యం చోటు చేసుకోగా, మైనారిటీ కార్పొరేషన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గిరిజన కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలకు సంబంధించిన వార్షిక ప్రణాళిక కూడా రూపొందించనట్లు తెలుస్తోంది.

స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత