
రైతుకు లంచాల ‘షాక్’
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరిన రైతుల నుంచి కొందరు విద్యుత్ శాఖ అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల నంద్యాల జిల్లాలో ఒక రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ముమ్మరంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 11,500 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా విద్యుత్ అధికారులు వెళ్లి బోరు పాయింట్ నుంచి విద్యుత్ పోల్ ఉన్న ప్రాంతం వరకు ఎన్ని పోల్స్ పడుతాయో తెలుసుకోవాలి. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు ఎన్ని పడుతాయో అంచనా వేయాలి. ఇందుకోసం రైతులు వేలాది రూపాయల ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. అలాగే ఎస్టిమేట్లు వేయడానికి విద్యుత్ అధికారులు వెళ్లడానికి రైతులు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాల్సి దుస్థితి నెలకొంది. ఎస్టిమేట్లు తయారు చేసిన తర్వాత డిమాండ్ నోటీసు ఇస్తే దాని ప్రకారం రైతు వాటా మొత్తాన్ని డీడీ చెల్లించాల్సి ఉంది. అయితే మండలస్థాయిలోనే మంజూరు అయితే ఒక రేటు, సబ్ డివిజన్ స్థాయిలో మంజూరు అయితే ఇంకో రేటు, డివిజన్ స్థాయిలో మంజూరు అయితే మరో రేటు ఉంటుంది. వెరసి ముడుపుల భారం రైతులపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెటీరియల్ ఇవ్వాలన్నా ముడుపులే!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందించరు. ‘‘ మీకు ఇంకా మెటీరియల్ రాలేదు.. రావడానికి మరో నెల రోజులు ఆలస్యం కావచ్చు.. కాకపోతే ఖర్చు అవుతుంది’’ అని బేరం పెట్టడం గమానార్హం. నిబంధనల ప్రకారం మెటీరియల్‌ను డిపార్టుమెంటు వాహనాల్లోనే తరలించాల్సి ఉంది. అయితే వాహనాలు రిపేరీలో ఉన్నాయని, డ్రైవర్ లేడని రవాణా భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. అధికారులు మాత్రం డిపార్టుమెంటు వాహనాలతో ట్రాన్స్‌పోర్టు చేశామని రికార్డు చేసుకొని డీజిల్ కాజేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చుక్కలు చూడాల్సిందే!
ఎస్టిమేట్లు వేయించుకోవడం ఒక ఎత్తు అయితే లైన్ వేయించుకోవడం మరో ఎత్తుగా మారింది. డిమాండ్ నోటీసుకు అనుగుణంగా రైతులు తమ వాటా మొత్తాన్ని చెల్లించిన తర్వాత పోల్స్ సరఫరా చేస్తారు. పోల్స్ ఇవ్వాలంటే ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. పోల్స్ సంఖ్యను బట్టి ముడుపుల రేటు పెట్టినట్లు సమాచారం. పోల్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్, కేబుల్, కండక్టర్ విద్యుత్ శాఖ స్టోర్ నుంచి డ్రా చేస్తారు. అయితే రైతుకు ఇవ్వరు. మళ్లీ ముడుపులు ముడితేనే పోల్స్ పాతి, లైన్ వేస్తారు. విద్యుత్ లైన్ నుంచి బోరు పాయింటు దగ్గరకు లైన్ వేయడానికి 180 మీటర్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. 11 కేవీ లైన్ వేస్తే 180 మీటర్లకు దాదాపు రూ.60 వేలు, ఎల్‌టీ(లోటెన్షన్) లైన్ వేస్తే రూ.45 వేలు వరకు ఖర్చు వస్తుంది. అవసరాన్ని బట్టి 11 కేవీ లేదా ఎల్‌టీ లైన్ వేస్తారు. 180 మీటర్లు దాటితే ఆ ఖర్చు రైతు భరించాల్సి ఉంది. లైన్ దూరాన్ని, ఎస్టిమేట్ మొత్తాన్ని బట్టి ముడుపుల రేటు ఉంటుంది. లైన్ వేయాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే.
ముడుపులు ఇస్తేనే
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకూ
మామూళ్లు ఇవ్వాల్సిందే
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన
విద్యుత్ శాఖ అధికారి