
కార్మికుల వినూత్న నిరసన
కోడుమూరు రూరల్: గూడూరులో నగర పంచాయతీ కార్మికులు మెడకు ఉరిగి తగిలించుకుని వినూత్న రీతిలో శనివారం ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో భాగంగా వారం రోజుల నుంచి గూడూరు నగర పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించి దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 15 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు, నెలనెలా జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికులు అల్లిబాషా, డూకేశ్వరరావు, షబ్బీర్‌బాషా, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, ఖాజాహుసేన్, ప్రభాకర్, ఉసేన్ పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
కోవెలకుంట్ల: స్థానిక ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలు.. ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన రమేష్(36) కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పిల్లలకు కొత్త దుస్తులు తీసుకొచ్చే విషయంలో శుక్రవారం రాత్రి భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి తోడు కొంతకాలం నుంచి రమేష్ క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్ధలు కొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుని భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్న మరివీడు గ్రామానికి చెందిన ఎం.రవి(32) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సీఐ విజయ భాస్కర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రవికు భార్య రోజా ఉంది. వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రవి ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. గురువారం కొత్త ఇంటికి స్లాబ్ వేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ ఇంట్లో కరెంట్ పడడం లేదని రవి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేయకుండానే రవి మృతిచెందడంతో భార్య, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

కార్మికుల వినూత్న నిరసన