
ఆర్‌ఎంపీలు స్కానింగ్‌కు రెఫర్ చేయొద్దు
కర్నూలు(హాస్పిటల్): గర్భిణిలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలని ఆర్‌ఎంపీలు రెఫర్ చేయవద్దని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. శాంతికళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణిలలో పిండం పెరుగుదల, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యం తదితర వాటిని గుర్తించేందుకు అర్హత కలిగిన వైద్యులు మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం రెఫర్ చేయవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు గర్భిణిలను స్కానింగ్ కోసం రెఫర్ చేయరాదని హెచ్చరించారు.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో బదిలీల ప్రక్రియ
కర్నూలు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో జోన్ ఫోర్ పరిధిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ల బదిలీలను శనివారం చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ హరేరామ్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన పర్యవేక్షణ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బదిలీలకు అర్హులైన జోన్ ఫోర్ పరిధిలో 8 మంది డీఈఈలు, 34 మంది సెక్షన్ ఆఫీసర్లకు బదిలీల ప్రతిపాదనలను ఈఎన్‌సీ కార్యాలయానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తయిన వారు బదిలీ కానున్నారని తెలిపారు.