
నెలరోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
ఆస్పరి: నెలరోజులకు పెళ్లి కావాల్సిన యువతి విద్యుదాఘాతంతో మృతి చెందారు. దీంతో ఆస్పరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పరిలో గురువారం కుళాయిలకు నీటిని సరఫరా చేశారు. పింజరి శభేరా (20) అనే యువతి కుళాయికి విద్యుత్ మోటారు వేసే సమయంలో విద్యుదాఘాతంతో స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆస్పరికి చెందిన పింజరి కాశన్న, బీబీ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. మూడో కుమార్తె శభేరాకు మండలంలోని ములుగుందం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈమేరకు గత 15రోజులకు క్రితం ఆస్పరిలో నిశ్చితార్థం కూడా చేశారు. జూన్ 22, 23వ తేదీల్లో పెళ్లి జరిగేలా కుటుంబ సభ్యులు నిశ్చయం చేసుకున్నారు. ఇంతలోనే విషాదకరమైన ఘటన జరగడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కంటతడి పెట్టారు.
యువతి ప్రాణం తీసిన విద్యుదాఘాతం