
నల్లమల మీదుగా ‘నంబాల’
ఆత్మకూరురూరల్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్‌కౌంటర్‌లో బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈయన పలుమార్లు, పలు హోదాల్లో నల్లమలలో పర్యటించారని మాజీ మావోయిస్టులు గుర్తు చేసుకుంటున్నారు. పీపుల్స్‌వార్ పార్టీ కేంద్ర కమిటీలోకి నంబాల కేశవరావు వచ్చిన తరువాత 1991లో నల్లమలకు వచ్చినట్లు కొందరు మాజీ మావోయిస్టులు తెలిపారు. 1995లో నల్లమలలో జరిగిన రాయలసీమ – దక్షిణ కోస్తా రీజినల్ మిలటరీ క్యాంప్‌నకు హాజరైనట్లు, 1997లో నల్లమల అడవిలో ఆయన పర్యటించినట్లు గుర్తు చేశారు. పీపుల్స్‌వార్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 1998లో నల్లమలలో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. చిట్టచివరి సారిగా నల్లమలకు 2003లో ఏపీ రాష్ట్ర కమిటీ ప్లీనంలో పాల్గొనేందుకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.