
టీబీ డ్యాంకు వరద నీరు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి వరద నీరు వస్తోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లీ, చిక్క మంగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులుండగా గురువారం 1,588.80 అడుగులు నమోదైంది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 9,993 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో రూపంలో 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు.
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణభోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తులు బారులు తీరారు.
శ్రీశైల దేవస్థానానికి
రూ.5లక్షల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం హైదరాబాద్‌కు చెందిన ఎం.శివాజీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అన్నప్రసాద వితరణకు రూ. 2 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి రూ.2లక్షలు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు రసీదు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు.

టీబీ డ్యాంకు వరద నీరు

టీబీ డ్యాంకు వరద నీరు