
యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్రా కార్యక్రమాల నిర్వహణపై గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక జిల్లాలో ఒక థీమ్‌తో స్టేట్ ఈవెంట్ యోగా సెషన్‌ను నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో జూన్ 17న 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్ 8న కర్నూలు, ఆదోని పత్తికొండ డివిజన్లలో సీనియర్ సిటీజన్లతో యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కొండారెడ్డి బురుజు, ఓర్వకల్లు రాక్ ఆర్డెన్, నగరవనం, మంత్రాలయంలలో మే 30, జూన్ 12, 18 తేదీల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో మే 26 నుంచి 30వ తేదీ వరకు వివిధ రకాల యోగా పోటీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మండల స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో, జూన్ 21వతేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంరోజు ప్రతి కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్‌నాయక్ పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన
జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా