రైతు బజారు నిండా దళారులే! | - | Sakshi
Sakshi News home page

రైతు బజారు నిండా దళారులే!

May 17 2025 6:39 AM | Updated on May 17 2025 6:39 AM

రైతు

రైతు బజారు నిండా దళారులే!

● కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు బజార్లలో దళారుల తిష్ట ● సిఫారస్సులతో కూటమి నేతల అనుచరులకు అవకాశం ● సీఎం వస్తుండటంతో స్టాళ్లలో ఒక్క రోజు మాత్రం రైతులు ఉండేలా అధికారుల యత్నం

కర్నూలు(అగ్రికల్చర్‌): అటు రైతులకు, ఇటు వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసిన సీ – క్యాంప్‌ రైతు బజార్‌ దళారీలకు అడ్డాగా మారింది. పేరులో మాత్రమే రైతు ఉన్నప్పటికీ వాస్తవంగా రైతుబజార్లలో వారికి స్థానం లేకుండా పోయింది. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలు దళారీలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోని టాప్‌ 5 రైతుబజార్లలో కర్నూలు సి.క్యాంపు రైతుబజారు ఒకటి. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు ఏడాది కాలంగా రైతుబజారులోకి తమ అనుకూలమైన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ‘వీరు మా వాళ్లు.. వారూ మావాళ్లు..’అంటూ సిఫారస్సు చేస్తూ రైతుబజారు నిండా దళారీలను నింపుతున్నారు. ఇటీవల సీ.క్యాంపు రైతుబజారులో దళారీలు ఎంతమంది ఉన్నారనే దానిని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆరా తీశారు. రైతుబజారులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు తదితర వాటిని అమ్ముకునే వారు దాదాపు 400 మంది ఉన్నారు. ఇందులో 98 శాతం దళారీలు, 2 శాతం మంది రైతులు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దళారీలను కట్టడి చేసేందుకు ప్రయత్నించే సిబ్బందిపై తిరుగబడుతుండటం గమనార్హం. రైతుబజారులో అమ్ముకుందామని కూరగాయలు తెచ్చుకున్న రైతులకు దళారీలు చుక్కలు చూపిస్తారు. దళారీలను తట్టుకోలేక ఏదో ఒక ధరకు కూరగాయలు అప్పగించి పోతున్నారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలు తెచ్చిన రైతులను లోనికి రానివ్వకుండా బయటనే దళారీలు కొంటారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొని అక్కడే బోర్డుపై రాసిన ధరలను ఏ మాత్రం పట్టించుకోకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే వినియోగదారుల పట్ల అమర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11వ తేదీ ఆదివారం వినియోగదారులతో రైతుబజారు కిటకిటలాడింది. బోర్డుపై రాసిన ధరలను పట్టించుకోవడం లేదంటూ... తూకాల్లో దగా చేస్తున్నారంటూ కనీసం 100 ఫిర్యాదులు వచ్చాయి. దళారీలు తిష్ట వేయడం వల్లనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం వస్తున్నారని..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన ఇటు రైతులు, అటు వినియోగదారులకు తీవ్ర కష్టాలకు గురి చేసింది. సీఎం వస్తున్నారు.. కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేయాలనే కారణంతో గురు, శుక్రవారాల్లో రైతుబజారులోకి ఎవరినీ అనుమతించడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలతో తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఏమీ చేసుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. క్వింటాళ్ల కొద్ది తెచ్చిన కూరగాయలను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో బయట అతి తక్కువ ధరకు దళారీలకు అమ్ముకోవాల్సి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుబజారులో జరిగే కార్యాక్రమంలో పాల్గొననుండటంతో రైతులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వినియోగదారులకు మాత్రం అనుమతి లేదు. సీఎం పర్యటన తమకు శాపంగా మారిందని రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. రైతుబజారుకు అన్ని వైపుల అనేక మంది కూరగాయ లు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరందరినీ ఖాళీచేయంచడంతో వందలాది మందికి ఉపాధి లేకుండా పోయింది.

రైతు బజారు నిండా దళారులే! 1
1/1

రైతు బజారు నిండా దళారులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement