
తుంగా తీరంలో మా‘రీచు’లు
మంత్రాలయం: రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సాగుతోంది. ఇందుకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులకు పట్టుకున్నారు. ఈ టిప్పర్లకు నంబర్లు లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలంలో మూడు ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్న మరళి, గుడికంబాళి, నదిచాగి గ్రామాలతో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి రీచ్‌ల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. దీంతో బిల్డర్లు ఇక్కడి ఇసుకను ఎక్కువగా ఇష్టపడతారు. గోడల ప్లాస్టరింగ్ నేరుగా ఇసుకను వినియోగానికి వస్తుండటంతో మక్కువ చూపుతున్నారు. ఇక్కడి నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా ఇసుకను తీసుకెళ్తున్నారు.
నంబర్ల ప్లేట్లు లేకుండా..
సరిహద్దులు దాటిపోతున్న టిప్పర్లకు నంబర్లు ప్లేట్లు తీసేస్తున్నారు. మాధవరం చెక్‌పోస్టు దాటుకుని పోతున్న ఓ ఇసుక టిప్పర్‌కు నంబర్ ప్లేటు కనిపించలేదు. భారత్ బెంజ్ పేరుతో ఉన్న మూడు టిప్పర్లలో ఇలాగే ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం. దర్జాగా చెక్‌పోస్టులను ఇసుక టిప్పర్లు దాటుకుని పోతున్నా ఎలాంటి అడ్డగింత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
చర్యలేవీ?
‘ఏదో టెండర్లు వేశాం.. రీచ్‌లు ఏర్పాటు చేశాం.. ఎవ్వరు ఇసుక ఎటు తీసుకెళ్తే మాకేం’ అన్నట్లు మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమణ రవాణాను పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కర్ణాటక మైనింగ్, పోలీస్ అధికారులు స్పందించారు. అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంకెళ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
టీడీపీ నేతల అండతోనే
సాగుతున్న ఇసుక దందా
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు
తరలింపు
పోలీసులకు పట్టుబడుతున్న టిప్పర్లు

తుంగా తీరంలో మా‘రీచు’లు