
● రాజ్యసభ సభ్యులు మోపిదేవి, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పెద్దపాడు రోడ్డులోని టీ శేషన్ననగర్‌లో నిర్వహించిన కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ.. మత్స్యకారుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి ఆర్థిక సహకారం అందిస్తానన్నారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మత్స్యకారులకు రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇస్తున్నారన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో తెలుగు, బెస్త, గంగపుత్ర సంఘం నేతలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి వెంట కర్నూలు, నంద్యాల మత్స్యశాఖ డీడీలు శ్యామలమ్మ, రాఘవరెడ్డి ఉన్నారు.