పంటల రుణ పరిమితి ఖరారు | - | Sakshi
Sakshi News home page

పంటల రుణ పరిమితి ఖరారు

Apr 1 2023 2:12 AM | Updated on Apr 1 2023 2:12 AM

- - Sakshi

నంద్యాల: వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2023–24 సంవత్సరానికి గాను పంటల వారీగా రుణపరిమితి (స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌) ఖరారు చేస్తూ రాష్ట్రస్థాయి టెక్నికల్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకుల ద్వారా రైతులు పంట రుణాలు పొందవచ్చు. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలనే విషయమై జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశమై నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపగా అక్కడ నివేదికపై చర్చించి ఆయా పంటలకు రుణ ప్రణాళికను విడుదల చేశారు. కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది రుణ పరిమితిని కొంత సడలించి, రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించారు. ఇస్తూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో కూలీల రేట్లు, ఇతర అంశాలు పరిగణలోకి తీసుకొని వెసులుబాటు కల్పించినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఏడాదికేడాది పెట్టుబడి వ్యయం, కూలీల ఖర్చు పెరుగుతుండటంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. పంట రుణ పరిమితిని ఒక ఎకరాకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు ఖరీఫ్‌, రబీ సీజన్లకు రుణాలు మంజూరు చేస్తాయి. మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఖరీఫ్‌గా, అక్టోబర్‌ నుంచి మార్చి వరకు రబీ సీజన్‌గా పరిగణించి రుణ ప్రణాళిక అమలు చేస్తారు. పంట రుణపరిమితి ఆధారంగా ఏడాది కార్యాచరణ రుణ ప్రణాళికను లీడ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో తయారు చేస్తారు. అర్హులైన రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌కార్డులు మంజూరు చేయాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ కార్డుల కింద గరిష్టంగా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణం అందజేస్తారు. ఇందుకు 7శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఏడాదిలోగా రుణం తిరిగి చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ బ్యాంకు అందజేస్తుంది. రూ.లక్షలోపు రుణం ఏడాదిలోగా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దీంతో రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతు సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారం నుంచి మినహాయింపుపొందే అవకాశం ఉంది.

అర్హులైన ప్రతి రైతుకు రుణం

జిల్లాలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందజేయడమే లక్ష్యంగా రుణ ప్రణాళిక తయారు చేశాం. కిసాన్‌ క్రెడిట్‌కార్డులకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉంటే ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణం బ్యాంకులు అందజేస్తాయి. రుణం ఏడాదిలో చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. పంటలకు వెచ్చిస్తున్న పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని పంట రుణ పరిమితిని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతి ఏడాది నిర్ణయిస్తుంది. రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకొని ఇబ్బందులు పడకుండా.. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వడ్డీ రాయితీ పొందాలి. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

– సత్యనారాయణ,

జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌, నంద్యాల

2023–24లో పంటలకు

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేస్తూ

ఉత్తర్వులు

మే నుంచి ఖరీఫ్‌, అక్టోబర్‌ నుంచి

రబీ రుణాలు మంజూరు

అర్హులైన రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులు

క్రెడిట్‌ కార్డు ఉంటే పూచీ లేకుండా

రూ.1.60 లక్షల వరకు రుణం

సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement