నకిలీ హాల్‌ మార్క్‌ దందా | - | Sakshi
Sakshi News home page

నకిలీ హాల్‌ మార్క్‌ దందా

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నాం

విజయవాడలో పుట్టగొడుగుల్లా నకిలీ హాల్‌మార్క్‌ కేంద్రాలు గంటల సమయం పట్టే హాల్‌ కేవలం సెకన్ల వ్యవధిలోనే... వినియోగదారులను మోసం చేస్తున్న జ్యూయలరీ దుకాణాలు బీఐఎస్‌ అధికారుల దాడుల్లో వెల్లడి

వినియోగదారులు బంగారం కొనేటప్పుడు బీఐఎస్‌ లోగో, 6 అంకెల హెచ్‌యూఐడీ నంబర్‌, స్వచ్ఛత 916 ఈ మూడు గమనించి కొనుగోలు చేయాలి. బిల్లు తప్పనిసరి తీసుకోవాలి. బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా నాణ్యతను పరీక్షించుకోవచ్చు. నకిలీలను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. హాల్‌ మార్క్‌ లేకుండా విక్రయించే దుకాణాలపై దాడి చేసి వస్తువులు సీజ్‌ చేశాం. నకిలీ హాల్‌మార్క్‌ వేసే లేజర్‌ మిషన్లు సీజ్‌ చేశాం. వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం.

– వివేక్‌ రెడ్డి, డెప్యూటీ డైరెక్టర్‌, బీఐఎస్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నకిలీ హాల్‌ మార్క్‌ కేంద్రాలకు విజయవాడ అడ్డాగా మారింది. నకిలీ దందా కొనసాగిస్తూ వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. బంగారు ఆభరణాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆభరణాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఓ వైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. అంతే స్థాయిలో నకిలీ హాల్‌ మార్క్‌ దందా కొనసాగుతోంది. కొన్ని దుకాణాలు హాల్‌ మార్క్‌ లేకుండా విక్రయాలు చేస్తుండగా, మరికొన్ని నకిలీ మార్క్‌ వేసి మోసం చేస్తున్నాయి.

నగరంలో ఉన్నవి

మొత్తం 14 హాల్‌మార్క్‌ కేంద్రాలే

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ లైసెన్స్‌ పొందిన బంగారు ఆభరణాల దుకాణాలు 909 ఉన్నాయి. ఇవి కాక అక్కడక్కడా కొన్ని లైసెన్స్‌ లేని దుకాణాలు కూడా ఉన్నాయి. బంగారు ఆభరణాల నాణ్యతను పరీక్షించి హాల్‌ మార్క్‌ వేసేందుకు అధికారికంగా 14 హాల్‌ మార్క్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి. హాల్‌ మార్క్‌ కేంద్రాలు బంగారు ఆభరణాలను పరీక్షించి వాటిపై బీఐఎస్‌ త్రిభుజాకార లోగో, స్వచ్ఛత– 22 క్యారెట్ల బంగారానికి 22కె916, ఆరంకెల హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌(హెచ్‌యూఐడీ) నంబరు వేస్తారు. ప్రతి నగకు ఈ హెచ్‌యూఐడీ నంబర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. తయారైన నగకు హాల్‌ మార్క్‌ వేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. హాల్‌ మార్క్‌ వేసిన వస్తువు వివరాలు బీఐఎస్‌ యాప్‌లో నమోదు చేస్తారు. వస్తువు నాణ్యతపై వినియోగదారుకు అనుమానం వస్తే ఈ హెచ్‌యూఐడీ నంబర్‌ ద్వారా అధికారిక హాల్‌ మార్క్‌ సెంటర్‌లో ఎక్కడైనా పరీక్షించుకునే అవకాశం ఉంది.

నకిలీ మార్క్‌ దందా ...

విజయవాడ నగరంలో వందలాది జ్యూయలరీ షాపులు ఉన్నాయి. వీటిలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. హాల్‌మార్క్‌ కేంద్రాలు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రెండు కేంద్రాలు పనిచేయడం లేదు. దుకాణాల్లో విక్రయించే ప్రతి ఆభరణాన్ని నాణ్యత పరీక్షలు చేసి హెచ్‌యూఐడీ నంబర్‌ వేయాల్సి ఉంటుంది. దీనికి గంటల సమయం పడుతుంది. అయితే కొందరు నకిలీలు వస్తువు వివరాలు నమోదు చేయకుండా, పరీక్షలు నిర్వహించకుండా సెకన్ల వ్యధిలో హాల్‌ మార్క్‌ వేసి మోసం చేస్తున్నారు. ఈ మోసానికి వన్‌టౌన్‌, టూటౌన్‌లో ఒక కాంప్లెక్స్‌ అడ్డాగా మారాయి. హాల్‌మార్క్‌ వేసేందుకు కేవలం రూ.100 లోపే ఖర్చవుతోంది. కానీ నాణ్యత బండారం బయటపడకుండా కొందరు వ్యాపారులు నకిలీ ముద్రలు వేసి మోసం చేస్తున్నారు. అచ్చం బీఐఎస్‌ లోగోను పోలి ఉన్న ముద్ర, 916 అని ముద్రిస్తున్నారు. తర్వాత కాలంలో వినియోగదారునికి అనుమానం వచ్చి పరీక్ష చేయించినా వాటి వివరాలు ఎక్కడా లభించవు. టూటౌన్‌లోని ఓ కాంప్లెక్స్‌లో నకిలీ దందాకు పాల్పడుతున్న ఓ దుకాణంపై ఇటీవల బీఐఎస్‌ అధికారులు దాడి చేశారు. హాల్‌ మార్క్‌ లేకుండా విక్రయిస్తున్న నగలను గుర్తించి 2 కేజీల బంగారు నగలు సీజ్‌ చేశారు. నకిలీ హాల్‌మార్క్‌ కేంద్రాలను గుర్తించి దాడులు చేశారు. అయినప్పటికీ నకిలీ దందాకు చెక్‌ పెట్టలేకపోతున్నారు. ఒక చోట దాడి చేసి పట్టుకుంటే మరో చోట వేరే పేరుతో హాల్‌మార్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి నకిలీలతో భారీ మొత్తాల్లో నష్టపోతున్నారు. బీఐఎస్‌ అధికారులు దాడులు చేస్తున్నా నకిలీగాళ్లు జంకుబొంకు లేకుండా దందా సాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement