డీఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్
మచిలీపట్నంఅర్బన్: డెంగీ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. 11వ జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు.
నీటి నిల్వలను తరచూ పరిశీలించడం, శుభ్రపరచడం, మూతపెట్టడం వంటి చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వారం ఒకరోజు శ్ఙ్రీడ్రై డేశ్రీశ్రీగా పాటిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ యుగంధర్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు వంటి పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు.


