బీపీ.. అప్రమత్తతతో హ్యాపీ! | - | Sakshi
Sakshi News home page

బీపీ.. అప్రమత్తతతో హ్యాపీ!

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

బీపీ.. అప్రమత్తతతో హ్యాపీ! లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక జీవనశైలి రెండు పదుల వయస్సులోనే హైపర్‌టెన్షన్‌ బారిన పడేలా చేస్తోంది. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించకుండానే గుండె, మెదడు, మూత్ర పిండాలు, నేత్రాలు వంటివి దెబ్బతినేలా చేస్తూ సైలెంట్‌ కిల్లర్‌గా మారింది. రక్తపోటు ఉన్న వారిలో 46 శాతం మందికి తమకు ఉన్నట్లే తెలియదని నివేదికలు చెపుతున్నారు. ప్రస్తుతం బీపీ రోగుల్లో 90 శాతం మందిలో జీవనశైలితో వచ్చే ప్రైమరీ బీపీ కాగా, కేవలం 10 శాతం మాత్రమే జన్యుపరమైన కారణాలతో వచ్చే సెకండరీ హైపర్‌టెన్షన్‌ వాళ్లు ఉంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 10 లక్షల వరకూ హైపర్‌టెన్షన్‌ రోగులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన జీవనశైలితో బీపీని నియంత్రించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006 నుంచి ప్రతిఏటా ఒక నినాదంతో మే 17 హైపర్‌టెన్షన్‌ డే జరుపుతోంది. ఈ ఏడాది ‘‘కలిసి కట్టుగా రక్తపోటును నియంత్రిద్దాం’’ అనే థీమ్‌తో అవగాహన కలిగించనున్నారు. దీనిని సమర్ధవంతంగా అదుపులో ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ (వ్యక్తులు, కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు) కలిసి కట్టుగా పనిచేయాలని, క్రమం తప్పకుండా బీపీని చెక్‌ చేసుకోవాలనేది ఈ థీమ్‌ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం హైపర్‌ టెన్షన్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారింది అనేందుకు ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే నిదర్శనం... ● విజయవాడ కృష్ణలంకకు చెందిన 29 ఏళ్ల యువకుడు ఆటోనడుపుని జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్ష చేయగా బీపీ 190/100 ఉంది. ● పోరంకికి చెందిన 37 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికి గుండెదడ, ఆయాసం, అలసట వంటివి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతనికి బీపీ పరీక్షించగా 170/90 రీడింగ్‌ ఉంది. వీరిద్దరే కాదు చాలా మందికి ఏదొక అనారోగ్య సమస్య వచ్చే వరకూ తమకు బీపీ ఉన్నట్లు గుర్తించలేక పోతున్నారు. ● 120/80ని నార్మల్‌గా చెపుతారు. ● 140/90 ఉంటే హై బీపీ ఉన్నట్లే ● సిస్టోలిక్‌ ప్రెజర్‌ (పైన రీడింగ్‌) 130 నుంచి 139 ఉండి, డిస్టోలిక్‌ ప్రెజర్‌ (కింద రీడింగ్‌) 80–89 ఉంటే ప్రీ హైపర్‌ టెన్షగా వైద్యులు చెపుతున్నారు. ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ● హై బీపీ ఉన్న కొందరిలో తలనొప్పి, కళ్లు తిరగడం, గుండెదడ, ఆయాసం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. కొందరికి ముక్కు నుంచి రక్తం కూడా కారుతుంది.

కలిసికట్టుగా రక్తపోటును నియంత్రిద్దాం సైలెంట్‌ కిల్లర్‌గా మారిన బీపీ లక్షణాలు కనిపించకుండా అవయవాలపై తీవ్ర ప్రభావం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 10 లక్షలకు పైగా వ్యాధి బాధితులు నేడు అంతర్జాతీయ హైపర్‌ టెన్షన్‌ డే

బీపీని కరెక్ట్‌గా తెలుసుకోవాలి

బీపీని కరెక్ట్‌గా తెలుసుకోవాలి. 18 ఏళ్ల వయసు దాటిన వారు రెండేళ్లకోసారి, 40 ఏళ్లు దాటితే ఏడాదికోసారి బీపీ చెక్‌ చేసుకోవాలి. మధుమేహుల్లో 70 శాతం మందికి బీపీ ఉంటుంది. బీపీ ఉన్న వారిలో 30 శాతం మందికి చెడు కొలస్ట్రాల్‌ ఉంటుంది. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను అదుపులో ఉంచుకోవాలి. బీపీ ఉన్న వాళ్లు యూరిన్‌ మైక్రో ఆల్బూమిన్‌ పరీక్షతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో, కొలస్ట్రాల్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాదు వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ ఉన్న వాళ్ల కోసం నిర్ధారించేందుకు 24 గంటలు బీపీని రికార్డు చేసే డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైపర్‌ టెన్షన్‌ను అదుపు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది.

- డాక్టర్‌ అనీల్‌కుమార్‌ నరాలశెట్టి, ఛీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, సెంటినీసిటీ, విజయవాడ

సైలెంట్‌ కిల్లర్‌గా...

బీపీని ఇలా తెలుసుకుందాం..

బీపీకి కారణాలివే..

C జన్యుపరమైన కారణాల్లో తల్లిదండ్రులకు బీపీ ఉన్నా, గురక, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్‌ వంటివి

C జీవనశైలి అంటే ఆహారపు అలవాట్లు, వత్తిళ్లు, వ్యాయామం లేక పోవడం, స్మోకింగ్‌, ఆల్కాహాల్‌, ఒబెసిటీ, ఎయిర్‌ పొల్యూషన్‌ వంటివి

C అధిక ఉప్పు తీసుకోవడం. ప్రతిరోజూ ఒక వ్యక్తి 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి

C పోటాషియం తక్కువుగా ఉండటం కూడా కారణమే.

అదుపులో ఉంచుకునే మార్గాలు..

● ఆహారపు అలవాట్లలో మార్పులు

● క్రమబద్దమైన వ్యాయామం

● ఆహారంలో సాల్ట్‌ తగ్గించుకోవడం,

● కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం

● ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటం,

● వత్తిడిలు తగ్గించుకోవడం

● స్మోకింగ్‌, ఆల్కాహాల్‌ అలవాట్లకు దూరంగా

ఉండటం చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement