ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో పీజీఆర్‌ఎస్
పెడన: ఒక్కో నియోజకవర్గంలో ప్రతి నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ(పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొట్టమొదటగా ఈ కార్యక్రమం పెడనలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. పెడనలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న పెడన ఫంక్షన్ హాలులో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి పీజీఆర్‌ఎస్‌ను జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా ప్రతి నెలలో నాలుగు శుక్రవారాలు ఒక్కో నియోజకవర్గంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను పరిష్కరించడానికి అధికారులు నియోజకవర్గ కేంద్రానికి రావడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో పి.పోతురాజు, మచిలీపట్నం ఆర్డీవో కె.సాంబశివరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, పెడన, కృత్తివెన్ను, గూడూరు, బంటుమిల్లి మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవదాయ అధికారి శాంతి బెయిల్ డిస్మిస్ విజయవాడలీగల్: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి తరఫున రెండవసారి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. శాంతి తరఫున న్యాయవాది గోలి నరసింహారావు వాదనలు వినిపిస్తూ, శాంతిని పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా ఏవిధమైన సమాచారం సేకరించలేకపోయారన్నారు. ఆమె కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆమెకు మూడేళ్లలోపు వయసు బాబు ఉన్నందున అతని బాగోగులు చూడాల్సిన బాధ్యత తల్లిగా ఆమెకు ఉన్నందున బెయిల్ మంజూరుచేయాలని న్యాయమూర్తికి తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, శాంతి పోలీసుల కస్టడీలో పూర్తిగా సహకరించలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని, బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌ను డిస్మిస్ చేశారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
సోనోవిజన్‌లో ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మార్కెట్‌లోకి సరికొత్త ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ విడుదలైంది. శుక్రవారం ఏలూరు రోడ్డులోని ‘విజయవాడ విజయ టాకీస్ సెంటర్ సోనోవిజన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ పి.భాస్కరమూర్తి, ఏపీ రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి.కిషోర్ బాబు తదితరుల చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు. ఇది ఆటో ఐస్ మేకర్‌తో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ అని భాస్కరమూర్తి చెప్పారు. 610 లీటర్ల వరకు వివిధ సామర్థ్యాలతో లభించే ఈ శ్రేణిలో ఇన్‌స్టా వ్యూ డోర్ ఎన్ డోర్, వాటర్ డిస్పెన్సర్, ఫ్రెష్ కన్వర్టర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ డోర్ శ్రేణి ధరలు రూ.1.18 లక్షల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దీంతో పాటు 674, 790 లీటర్ల సామర్థ్యం గల అతి పెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా ఎల్‌జీ ఎల క్ట్రానిక్స్ ఇండియా లాంచ్ చేసినట్లు భాస్కరమూర్తి వివరించారు.