జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ తిరువూరు: ఇబ్రహీంపట్నం–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున రెండు లారీలు ఢీకొన్నాయి. విజయవాడ వైపు వెళ్లే లారీని రవాణాశాఖాధికారి తనిఖీ నిమిత్తం బజాజ్‌ షోరూం వద్ద ఆపగా ఆ లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకు వేశాడు. దీంతో వెనుకనుంచి వచ్చిన మరో లారీ ఆ లారీని ఢీకొట్టింది. మహారాష్ట్ర లోని నాందేడ్‌ నుంచి హనుమాన్‌ జంక్షన్‌ కోళ్లమేత లోడుతో వెళుతున్న లారీ ముందుభాగం నుజ్జవగా డ్రైవరు గంగారాం నగరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమచికిత్స అనంతరం విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో మరో వ్యక్తి మృతి ఎ.కొండూరు: మండలంలో కిడ్నీ వ్యాధి బాఽరిన పడి మరో వ్యక్తి మృతి చెందాడు. ఎ.కొండూరు మండల పరిధిలోని కొండూరు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య (45) గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఎ.కొండూరు మండల ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మరణాలు వరుసగా సంభవిస్తుండటంతో పాటు కిడ్నీ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోందని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి మండలంలోని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన నల్లంటి హర్షవర్థనరావు(19) నారాయణ కాలేజీ బెంజిసర్కిల్‌ వద్ద మెటీరియల్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. అతను కానూరులో హాస్టల్‌లో ఉంటాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి హర్షవర్థన్‌రావు తన సహద్యోగి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బైక్‌ పై కానూరుకు బయలుదేరారు. ప్రవీణ్‌కుమార్‌ నిర్లక్ష్యంగా బైక్‌ నడపటంతో కానూరు పెట్రోల్‌బంక్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో బైక్‌ వెనుక కూర్చున్న హర్షవర్థన్‌రావు రోడ్డుపై పడిపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హర్షవర్థన్‌రావు గురువారం మృతి చెందాడు. మృతుడి బాబాయి బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement