దుర్గమ్మ సేవలో హోం మంత్రి అనిత | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో హోం మంత్రి అనిత

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

దుర్గమ్మ సేవలో హోం మంత్రి అనిత కృష్ణాజిల్లా అండర్‌–19 ఉమెన్‌ క్రికెట్‌ టీమ్‌ ఎంపిక హాస్టళ్ల భవన నిర్మాణాలను పూర్తి చేయాలి మునిసిపల్‌ కమిషనర్లు అన్న క్యాంటీన్‌లో భోజనం చేయాలి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హోం మంత్రి అనిత గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం హోంమంత్రికి వేద పండి తులు ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకట రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లా అండర్‌–19 ఉమెన్‌ క్రికెట్‌ జట్టు ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిచేశామని కృష్ణాజిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. కెప్టెన్‌గా మహమ్మద్‌ మెహాక్‌, సభ్యులుగా వి.అక్షయ, సీహెచ్‌.ధనశ్రీ, బి.స్రవంతి, టి.గుణచంద్రిక, పి.లక్ష్మీఅపర్ణ, బి.తమిళిక, ఆర్‌.చేతన ప్రియ, ఎం.సృజన, జె.ఎన్‌.ఎస్‌.ఎస్‌.యశశ్విని, జి.హరిణి, కె.హరిక, ఆర్‌.మానస యశోధ, కె.కీర్తి, ఆర్‌.ఇష్క్‌మయి, స్టాండ్‌బైగా సీహెచ్‌.గీతికాకృష్ణ, వి.దివ్యప్రియ, పి.సుమశ్రీ, పి.ఆనంద్‌ దీప్తి, కె.సిసిర, కె.మేఘనాసాయి, ఎస్‌.ఎస్‌. శ్రీకరిని ఎంపిక చేశారు.

పామర్రు: జూన్‌ పదో తేదీ నాటికి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనులను పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా పామర్రులో నిర్మాణంలో ఉన్న హాస్టల్‌ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లావణ్యవేణి మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం పనులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో హాస్టళ్ల అభివృద్ధికి రూ.2.3 కోట్లు అదనంగా, డీఎంఎఫ్‌ నుంచి రూ.4.5 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు, ఇతర నిత్యావసర సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్‌ షేక్‌ షాహిద్‌బాబు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): మునిసిపల్‌ కమిషనర్లు వారంలో ఒక రోజు అన్న క్యాంటీన్లలో భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట సాయిబాబా గుడి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆయన గురువారం మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్రతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఉన్న సదుపాయాలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగు నీటి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌, కూలర్లు, దోమ తెరలు, ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వారిద్దరూ రూ.5 చొప్పున చెల్లించి టోకెన్లు తీసుకుని అందరితో కలిసి భోజనం చేశారు. ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యతపై అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement