అతిథిలా చేరి.. పెళ్లింట చోరీలు | - | Sakshi
Sakshi News home page

అతిథిలా చేరి.. పెళ్లింట చోరీలు

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

కానూరులో అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్‌ వివరాలు వెల్లడించిన కృష్ణా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌: జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో పాటు గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పెనమలూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన కథనం ప్రకారం..

మధ్యప్రదేశ్‌కు చెందిన అనికేష్‌ కుమార్‌ సాన్సి, రితేష్‌ పలు రాష్ట్రాల్లో దొంగతనాలతో పాటు గంజాయి అమ్మకాలు జరుపుతుంటారు. గురువారం పెనమలూరు సీఐ వెంకటనారాయణకు కానూరు తులసీనగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. దీంతో సీఐ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా వారు కానూరుతో పాటు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో జరిగిన అనేక వివాహ వేడుకల్లో చోరీలకు పాల్పడి సుమారు రూ.10 లక్షల ఖరీదు చేసే 55 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 3,10,000 నగదును అపహరించినట్లుగా అంగీకరించారు.

గంజాయి అమ్మకాలు కూడా..

అలాగే వీరువురు గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఒప్పుకోవటంతో వారి వద్ద నుంచి 3.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు, గన్నవరం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ, పి. శ్రీనివాస్‌, స్పెషల్‌బ్రాంచ్‌ సీఐ సత్యకిషోర్‌, పెనమలూరు సీఐ వెంకటరమణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement