మచిలీపట్నంటౌన్: నగరంలోని ఏపీసీపీడీసీఎల్ కృష్ణా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి.పుల్లారెడ్డి గురువారం సర్కిల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజీ సమస్యల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని, రెవెన్యూ కలెక్షన్లు వంద శాతం సాధించాలని, లో ఓల్టేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ బ్రేక్‌డౌన్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లక్ష్యాన్ని అందుకోవాలి..
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సీపీడీసీఎల్ పరిధిలో ఆగస్టు నెలాఖరు లోపు 1.91లక్షల సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటి వరకు సీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 40 వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంపై సమీక్ష నిర్వహించి, అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ దరఖాస్తులను మూడు నెలల్లోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్‌ఈ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


