కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంపొందించేందుకు సాంకేతికతను తీర్చిదిద్దాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి సేతు పథకం ద్వారా రూ.200కోట్లతో పారిశ్రామిక శిక్షణ సంస్థలను పటిష్ట పరిచేందుకు సంకల్పించిందన్నారు. అందులో 50శాతం కేంద్ర ప్రభుత్వం, 33శాతం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 17శాతం పరిశ్రమ నెలకొల్పే భాగస్వామి భరించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కౌశలం పథకం ద్వారా 60 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో దశలవారీగా 10వేల మంది పరీక్షలు రాశారని వారిలో 1,480 మందికి వివిధ కంపెనీల నుంచి ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


