ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో చౌకబారు దందా | - | Sakshi
Sakshi News home page

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో చౌకబారు దందా

May 12 2026 5:18 AM | Updated on May 12 2026 5:18 AM

200 కిలోలకు పైగా తరుగు

డీలర్లు స్వయంగా వచ్చి తీసుకెళ్లాలి

పెడన: రేషన్‌ డీలర్లకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే బియ్యం తూకంలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. మచిలీపట్నం ఎంఎల్‌ఎస్‌ (మండల లెవెల్‌ స్టాక్‌) పాయింట్ల నుంచి రేషన్‌ డీలర్లకు సరఫరా అయ్యే చౌకబియ్యం బస్తాల్లో తూకం తగ్గిపోతోంది. 50 కిలోల కట్టకు కిలోన్నర నుంచి రెండు కిలోలకు పైగా బియ్యం తగ్గిపోతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చే బియ్యం కట్టల విష యంలో వెయిటేజీ ప్రకారం తూకం తగ్గితే అదనపు కట్టలు (బియ్యం బస్తాలు) తీసుకుని అధికారులు కచ్చితత్వం పాటిస్తారు. రేషన్‌ డీలర్లకు మాత్రం వెయిటేజ్‌ ప్రకారం కాకుండా కట్టలు ప్రకారం పంపిణీ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తగ్గిన బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలోనూ ఇదే పరిస్థితి..

గతంలో అంటే సుమారు ఆరేడు నెలలు కింద కూడా బియ్యం కట్టల్లో తూకం తేడా రావడంతో డీలర్లు వాటిని తిరిగి పంపించేశారు. పరిస్థితి దారుణంగా మారుతోందని గ్రహించిన ఉన్నతాధికారులు సైతం తప్పును సరిదిద్దుకుని సక్రమంగా బియ్యం సరఫరా చేశారు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని డీలర్లు వాపోతున్నారు.

ఎంపిక చేసిన డీలర్లకు మాత్రమే..

డీలర్లు అందరికీ ఒకే సారి తూకం తగ్గిస్తే అనుమానాలు వస్తున్నాయని గుర్తించిన అక్రమార్కులు మండలంలో ఒక్కొక్క సారి ఇద్దరు లేదా ముగ్గురు డీలర్లను ఎంపిక చేసుకుని వారికి మాత్రమే బియ్యం తగ్గించి పంపించేలా చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కన వారికి కచ్చితంగా వచ్చినప్పుడు మీకు ఎందుకు రావనే వాద నను తీసుకువచ్చి డబాయిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. తూకంలో తేడాలను కొందరు సర్దుకుపోతుండగా మరికొందరు తమ వల్ల కాదంటూ తిప్పి పంపించేలా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అల్లరి కాకుండా వారి నోళ్లను భయపెట్టి, అధికారాన్ని అడ్డం పెట్టి లేదా తగ్గిన బియ్యాన్ని పంపించి అక్రమ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చే బియ్యం బస్తాల్లో కచ్చితమైన తూకం

డీలర్లకు పంపిణీ చేస్తున్న బస్తాల్లో మాత్రం తగ్గిపోతున్న బరువు

50 కిలోల కట్టకు 2 నుంచి 1.5 కిలోలు తగ్గుతున్న వైనం

తూకంపై నోరు విప్పితే ఇబ్బందిపెడతారని డీలర్ల ఆందోళన

ఒక్కొక్క చౌక దుకాణాల డీలరు తన పరిధిలోని కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయడానికి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సుమారు 200 నుంచి 250 కట్టలు వరకు దిగుమతి చేసుకుంటారు. ఒక్కొక్క కట్ట నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు తరుగు ఉంటోంది. మొత్తంగా అన్ని కట్టల్లో కలిపి 200 నుంచి 250 కిలోల వరకు తరుగు ఉంటోంది. అంటే నాలుగైదు బస్తాలు తరుగు కింద వస్తుండటంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసువెళ్తున్న ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు.

రేషన్‌ డీలర్లను స్వయంగా వచ్చి కాటా పెట్టి బియ్యం తీసుకువెళ్లాలని స్పష్టం చేశాం. డీలర్లకు ఇచ్చే బియ్యం కట్టలు సరైన తూకం ఉండేలా చూసి పంపిస్తున్నాం. డీలర్లు రాకపోతే మేమే కాటా పెట్టించి పంపిస్తున్నాం. వారికి బియ్యం అందిన వెంటనే కాటా పెట్టుకుని, ఒకవెళ తగ్గితే మా దృష్టికి తీసుకురావాలని చెప్పాం. ప్రతి నెలా 22, 23వ తేదీల్లో బియ్యం సరఫరా జరుగుతుంది. మాకు వెయిటేజ్‌ ప్రకారం వచ్చే బియ్యాన్ని, మేము కూడా కచ్చితమైన తూకం పెట్టి డీలర్లకు పంపిణీ చేస్తున్నాం.

– కె.లావణ్య, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి, మచిలీపట్నం

Advertisement
 
Advertisement
Advertisement