వడదెబ్బ.. తస్మాత్‌ జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బ.. తస్మాత్‌ జాగ్రత్త!

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

వడదెబ్బ.. తస్మాత్‌ జాగ్రత్త!

రానున్న రోజుల్లో ఎండల తీవ్రతతో పాటు వడగాలులు సైతం వీచే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది

బయటకు వెళ్లేటప్పుడు ఎండ ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అత్యవసరమైతేనే బయటకువెళ్లాలి

ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి

మసాలాలు, ఫ్రై వంటి ఆహారం ఎండలోకి వెళ్లే సమయంలో తీసుకోకుండా ఉండటమే మేలు.

శీతలపానీయాల కంటే కొబ్బరినీళ్లు, మజ్జిగ తీసుకోవడం మేలు

ఎండల తీవ్రతకు అనారోగ్య సమస్యలు విరేచనాలు.. ఐదారు రోజులు తీవ్రమైన నీరసం తలనొప్పి, దురదలు, నిద్రలేమి వంటి సమస్యలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

జాగ్రత్తలు

తీసుకోవాల్సిందే

‘దీర్ఘకాలిక’ప్రభావం

లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి ఎండల తీవ్రతకు ప్రస్తుతం విజయవాడ నగరంలో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. శరీరంపై దురదలతో పాటు, తీవ్రమైన తలనొప్పి, ఎండలో ఎక్కువగా తిరిగిన వారికి రాత్రి వేళల్లో నిద్ర పట్టక పోవడం వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారిలో కొందరు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నగరంలో ఇప్పటి వరకూ అత్యధికంగా ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ దాటకున్నా, దాని తీవ్రత(ఫీల్స్‌)46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. ఆ సమయంలో అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలపై ప్రభావం చూపుతున్నారు. ఆ సమయంలో బయట తిరిగినప్పుడు తమకు తెలియకుండానే శరీరంలో నీరు ఆవిరై డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా సాయంత్రం వేళ ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

వీరిపై ప్రభావం ఎక్కువ..

ఎండల తీవ్రత.. దీర్ఘకాలిక రోగులపై త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌, క్యాన్సర్‌ రోగులపై ప్రభావం ఉంటుందంటున్నారు. వారితో పాటు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ఎండల తీవ్రత ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. అలాంటి వారు ఎండల్లోకి రాకుండా ఉండటమే మంచిదంటున్నారు. వృద్ధులు కూడా త్వరగా డీ హైడ్రేషన్‌ ప్రభావానికి గురవుతారని పేర్కొంటున్నారు.

విజయవాడ మధురానగర్‌కు చెందిన 40 ఏళ్ల సురేష్‌ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి మార్కెటింగ్‌ విభాగంలో పని చేస్తుంటారు. నిత్యం ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వెళ్తుంటారు. వారం రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడ్డారు. విరేచనాలతో పాటు, తీవ్రమైన నీరసంతో వారం రోజులు ఇంటికే పరిమితమయ్యారు.

పటమట ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల అఖిల్‌ చిరు వ్యాపారి. వ్యాపార పనులపై నిత్యం నగరంలో బైక్‌పై తిరుగుతుంటారు. ఐదు రోజుల క్రితం తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరి ఫ్లూయిడ్‌ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఎండ ప్రభావం త్వరగా చూపుతుంది. వారు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రతకు గురకాకుండా చూసుకోవాలి. మంచినీరు అధికంగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ఎండతీవ్రతకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి.

–డాక్టర్‌ టి.వి.మురళీకృష్ణ,

జనరల్‌ ఫిజీషియన్‌

Advertisement
 
Advertisement
Advertisement