చందర్లపాడు(నందిగామ టౌన్): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మహిళ హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు నందిగామ రూరల్ సీఐ చవాన్ పేర్కొన్నారు. చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన ఎస్‌ఐ ధర్మరాజుతో కలిసి హత్య కేసు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన బాడిశ నాగలక్ష్మి కనిపించటం లేదని భర్త నరసింహారావు గత నెల 24న ఫిర్యాదు చేయటంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పలు కోణాలలో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పారెల్లి గోవిందయ్య భార్య మహాలక్ష్మిలు పథకం ప్రకారం నాగలక్ష్మిని హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతురాలితో గోవిందయ్యకు అక్రమ సంబంధంతో పాటు కుటుంబ వివాదాలు తలెత్తటంతో కోనాయపాలెం నుంచి నాగలక్ష్మిని పిలిపించి మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌ప్లాజా సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో మోది చంపారని వెల్లడించారు. ఆ తరువాత మృతదేహాన్ని, అందుకు సంబంధించిన సాక్ష్యాలను శ్రీశైలం అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు చెప్పారు. నిందితుల వాంగ్మూలం ప్రకారం మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి మహిళ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన భార్యభర్తలను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. రోజుల వ్యవధిలోనే హత్య కేసును చేధించిన ఎస్‌ఐ ధర్మరాజు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


